Saturday, March 12, 2011

ప్రియమైన CM గారు...

ప్రియమైన CM గారు,
ఎవరిదైన పెంపుడు కుక్క మిమ్మల్ని కరిచిందనుకొండి. మీరు కేసు కుక్కపై పెడతారా లేక కుక్క యజమానిపైనా?
మిలీనియం మార్చ్ లో విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని శిక్షిస్తాం అని స్టేట్మెంట్ ఇచ్చేబదులు, పిచ్చి కుక్కల్ని ఒక చోట చేర్చి రెచ్చగొట్టి వదలిన నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోరు?

Friday, March 11, 2011

ప్రళయమా, నిన్ను అర్ధిస్తున్నాను. నా రాష్ట్ర పజలకోసం .


ఈ రోజు హారం లో " జపాన్ లో భారీ భూకంపం , 8 .4 గా రిక్టరు స్కేలు పై నమోదు .
జపాన్ లో సున్డాయ్ నగరం , టోక్యోలు బాగా నష్టపోయాయి అని , వీడియోలతో సహా ఒక బ్లాగర్( 24 గంటలు ) ప్రచురించిన వార్త చూసి 
[అన్ని వివరాలకు http://24gantalu.blogspot.com/2011/03/blog-post_11.html   ]చాలా బాధ పడ్డాను.

తర్వాత "దేవుడికి అసలు కనికరమే ఉండదా ? అసలు దేవుడే లేడా, ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలు " అంటూ దేవుడి మీద పడ్డాను.

సాధారణం గా నేను ఏ ఒక్కదేవుడినో నమ్మను ,దేవుడు ఉన్నాడని నమ్మేకన్నా, అందరినీ నడిపించే ఒక అద్భుత శక్తి ఉంది అని నేను నమ్ముతాను .

ఎన్ని మతాల వారు . ఎన్ని రకాలుగా , ఎన్నెన్ని భాషల్లో పిలిచినా పలికే ఓ అద్భుత శక్తీ , భారమైన గుండెతో,
భాష్ప తప్త నయనాలతో నిన్ను నేను అర్ధిస్తూ కోరుకునేది ఒక్కటే ,

ప్లీజ్ దయచేసి ఒక్కసారి ప్రళయాన్ని సృష్టించు.
కలుషాలతో నిండిపోయిన మా కలియుగాన్ని , కొన్ని కోట్ల సునామీలు ఒకేసారి , వీలుంటే ఈ క్షణమే సృష్టించైనా ప్రక్షాళన చేసేయ్, అంతం చేసేయ్ , నీలో ఐక్యం చేసేయ్ .
 
నా కనుచూపు మేరలో మార్పు కనిపించట్లేదు .
మార్పు వస్తుందన్న ఆశా లేదు, మార్పు తెచ్చే మార్గమూలేదు.

కొందరి దూషణలతో ,మరికొందరి భాషణలతో,
కొందరి చేష్టలతో, మరికొందరి నిశ్చేష్టలతో,
కొందరి ఉద్యమాలతో, మరికొందరి మాధ్యమాలతో
కొందరి విధ్వంసంతో, మరి కొందరి ఉత్సాహం తో 


విసిగి వేసారి పోయాను,మార్పంటే ఏమిటో మర్చిపోయాను. నాకు నేనే మారిపోయాను .
ఇన్నాళ్ళుగా అడ్డొచ్చిన సహనం నిన్నటితో చచ్చిపోయింది,ఎవరు తనో, ఎవరు పరో నిన్నటి తో తెలిసిపోయింది.
 ఉందనుకున్న సౌభ్రాతృత్వం లేదని తేలిపోయింది .


మనుషులే పోయాకా విగ్రహాలెందుకట,
ఉద్యమాల పేరుతో పసి పిల్లల్ని పొట్టన పెట్టుకున్నప్పుడే అడగనోల్లు, బోడి బొమ్మలు నేలకూలితే లొల్లి చేస్తరేమంటుండ్రు.


నరనరాన నిండిపోయిన ప్రాంతీయ విద్వేషాలతో, సాటి మనిషిని మరో మనిషి  దూషిస్తూ , హింసిస్తూ , మారణ హోమాలు సృష్టిస్తూ ,భావితరాలకు అందించాల్సిన గతకాలపు స్మృతుల్ని ,జ్ఞాపకాల్ని మర్చిపోయి , ఆదర్శాల్ని అదిలిస్తూ , సిద్దాంతాల్ని చెరిపేస్తూ  , వేదాంతాలని వెలివేస్తూ ,సమానత్వాన్నిసమాధిచేస్తుంటే ,

సౌభ్రాతృత్వానికి, నిగ్రహానికి అర్దమేమిటి అని నన్నునేను ప్రశ్నించుకుంటే, నేలకొరిగిన విగ్రహాలు మాదేనని బదులిస్తున్నయి.

ఉద్యమానికి ఉదృత దశ ఉన్మాదమట,
ఉన్మాదానికి తదుపరి దశ ఉగ్రవాదం కాదా ?

ప్రాంతీయ తత్వాన్ని  విగ్రహాలకు  ఆపాదించి , ఉన్మాదం తో వాటిని  ధ్వంసం  చేసి   సర్ది  చెప్పుకున్న  మేధా (తా)వులు  ,
వేరే  ప్రాంతం  వాళ్ళపై దాడిచేసో  ( ప్రస్తుతమూ  జరుగుతున్నాయి  ) , చివరికి  హత్యలు   , మాన భంగాలు  చేసో  ఉద్యమాల్లో  ఇవీ  మామూలే  అని సరిపెట్టుకోరా  ?

నిగ్గ  దీసి  అడిగితే ,  ఈ సిగ్గులేని  ప్రభుత్వాలు   , నిన్న  కాపలా  ఉన్నట్టే  అప్పుడు  కూడా  అన్నీ  మూసుకుని  కూర్చుంటాం అంటాయేమో.
 

మరిన్ని ద్వేషాలు పెరగకుండా ,
మరిన్ని భావాలు గాయపడకుండా ,
మరింత ఉన్మాదం , ఉగ్రవాదం పెచ్చుమీరకుండా,
ఓ శక్తీ
మమ్మల్ని ఇప్పుడే తీసుకుపో .. 

కలియుగం నేడు బలియుగమయిపోయింది
తర్వాత ఏదైనా యుగాన్ని సృష్టించుకోవాలి అని నీకు ఆశగా ఉంటే ఏ శిలా యుగాన్నో సృష్టించుకో,
ఎందుకంటే శిలలకు ప్రాణం ఉండదు , కోపం ఉండదు , ద్వేషం ఉండదు , ఆలోచన ఉండదు , ఆక్రందనా ఉండదు. 
అన్నింటికీ మించి ప్రాంతీయ భేదముండదు.